Jagan: ఢిల్లీలో జగన్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులకు పలు విన్నపాలు

AP CM Jagan Met With Amit Shah and Shekhawat
  • అమిత్ షాతో దాదాపు గంటన్నరపాటు భేటీ
  • హైకోర్టును కర్నూలులో పెడుతూ రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి
  • ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న సీఎం
  • తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని విన్నపం
  • రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి షెకావత్‌కు అభ్యర్థన
  • నేడు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశం
నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలుసుకున్న జగన్.. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ గతేడాది చట్టాన్ని తీసుకొచ్చామని, కాబట్టి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా గ్రాంట్లు వస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని అభ్యర్థించారు. విశాఖలోని అప్పర్ సీలేరు రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ. 10,445 కోట్ల వ్యయంలో 30 శాతం నిధులు సమకూర్చాలని కోరారు. 14, 15వ ఆర్థిక సంఘం బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి  చేశారు. దిశ బిల్లును ఆమోదించాలని, విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో తాము గుర్తించిన 250 ఎకరాల స్థలంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని, రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. నిధుల చెల్లింపులో జాప్యం జరగకుండా చూడాలని షెకావత్‌ను జగన్ కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు.

ముఖ్యమంత్రి నేడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌లతో సమావేశం అవుతారు.
Jagan
Andhra Pradesh
Amit Shah
Gajendra Singh Shekhawat
AP High Court
Kurnool District
Polavaram Project

More Telugu News