Vishnu Vardhan Reddy: మంత్రి కొడాలి నాని గారు, మీ ప్రభుత్వం ఈ సమాచారం ఎందుకు చెప్పడంలేదు?: విష్ణువర్ధన్ రెడ్డి
- రైతుల ధాన్యం కొనుగోలు సమాచారం చెప్పాలి
- దీనిపై మీరు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు?
- 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు
- దళారుల ముసుగులో వైసీపీ నేతలు ఉన్నారు
ఏపీలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర మంత్రిని నిలదీస్తూ ట్వీట్ చేశారు. 'మంత్రి కొడాలి నాని గారు, మీ వైఎస్సార్ సీపీ పార్టీ ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు సమాచారం ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయాలపై మీరు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు?' అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
'45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. ఒకవైపు సరసమైన ధరలకు అమ్ముకోవాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అది కూడా బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది.
పౌరసరఫరాల శాఖ మంత్రి దీని గురించి మాట్లాడడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంపై మంత్రి కొడాలి నాని మాట్లాడాలి. దళారుల ముసుగులో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేదంటే ఆందోళనలకు దిగుతాం' అని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.