Mukul Roy: తనయుడితో పాటు టీఎంసీ పార్టీలోకి తిరిగొచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్

BJP national vice president Mukul Roy joins TMC

  • సీఎం మమతా బెనర్జీ సమక్షంలో సొంతగూటికి చేరిన వైనం
  • సాదరంగా స్వాగతించిన మమత
  • ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వ్యాఖ్యలు
  • బీజేపీలో ఎవరూ ఉండలేరన్న ముకుల్ రాయ్

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సొంతగూటికి తిరిగొచ్చారు. తనయుడు సుభ్రాంశు రాయ్ తో కలిసి ఆయన ఇవాళ టీఎంసీలో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలోకి పునరాగమనం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, ముకుల్ రాయ్ పాత పార్టీనే మేలని భావిస్తున్నారని, "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అని వ్యాఖ్యానించారు. ముకుల్ రాయ్ ని పార్టీలోకి స్వాగతిస్తున్నామని, ఆయన పార్టీలో కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు డబ్బు కోసం, బీజేపీ కోసం పార్టీకి ద్రోహం తలపెట్టిన వారు, పార్టీపై విమర్శలు చేసినవారిని తాము పరిగణనలోకి తీసుకోవడంలేదని టీఎంసీ వైఖరిని మమత స్పష్టం చేశారు.
పార్టీలో చేరిక సందర్భంగా ముకుల్ రాయ్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో ఎవరూ ఉండలేరని, అందుకే టీఎంసీలో చేరానని వెల్లడించారు. మమతా బెనర్జీతో తనకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు.

ముకుల్ రాయ్ టీఎంసీ పార్టీ స్థాపన సమయంలో కీలకపాత్ర పోషించినవారిలో ఒకరు. ఆయన 2017లో బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముకుల్ రాయ్ మాత్రమే కాదు, మరికొందరు బీజేపీ నేతలు కూడా టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News