Egg: వెయ్యేళ్ల నాటి కోడిగుడ్డును కనుగొన్న ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రజ్ఞులు
- యావ్నే పట్టణం వద్ద తవ్వకాలు
- పురాతన కందకంలో గుడ్డు లభ్యం
- చిన్నపాటి పగుళ్లు తప్ప సరైన స్థితిలోనే ఉన్న గుడ్డు
- డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్రపరుస్తామన్న పరిశోధకులు
ఇజ్రాయెల్ లో పురావస్తు తవ్వకాల సందర్భంగా ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. దాదాపు 1000 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న కోడిగుడ్డును పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ గుడ్డు ఇప్పటికీ సరైన స్థితిలోనే ఉంది. యావ్నే పట్టణ శివార్లలోని ఓ పురాతన కందకంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (ఐఏఏ) ఈ గుడ్డును గుర్తించింది.
ఇది ఇస్లామిక్ యుగం నాటిది అని భావిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంలేదని, అలాంటిది వెయ్యేళ్ల నాటి గుడ్డు ఇప్పటికీ , చిన్నపాటి పగుళ్లు తప్ప మిగతా భాగం చెక్కుచెదరకుండా ఉండడం విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నారు. దీన్ని భవిష్యత్తులో డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్ర పరుస్తామని, అయితే ఓ కందకంలోకి కోడిగుడ్డు ఎలా వచ్చిందో తెలియడంలేదని పేర్కొన్నారు.