Corona Virus: డెల్టా వేరియంట్‌కు 50 శాతం అధిక సాంక్రమిక శక్తి: ఎన్‌సీడీసీ అధ్యయనం
- రోగనిరోధకతను తప్పించుకునే శక్తీ ఎక్కువే
- ఢిల్లీలో ఏప్రిల్‌లో వచ్చిన కేసుల్లో 60 శాతం ఈ రకమే
- సీరోపాజిటివిటీ, వ్యాక్సినేషన్ వ్యాప్తిని అడ్డుకోని వైనం
- ఏప్రిల్‌లో ఆల్ఫా వేరియంట్‌ను అధిగమించిన డెల్టా
దేశ రాజధాని ఢిల్లీలో నాలుగో వేవ్ సందర్భంగా వెలుగు చూసిన అధిక కరోనా కేసులకు డెల్టా వేరియంటే కారణమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ), సీఎస్‌ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటగ్రేటివ్ బయాలజీ జరిపిన అధ్యయనం తెలిపింది. ఏప్రిల్‌లో వెలుగు చూసిన కేసుల్లో 60 శాతం ఈ వేరియంట్ వల్లేనని పేర్కొంది. ఈ వేరియంట్‌కు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం సైతం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు సాంక్రమిక శక్తి 50 శాతం అధికంగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముందస్తు కరోనా కేసులు, అధిక సీరోపాజిటివిటీ, పాక్షిక వ్యాక్సినేషన్ వంటి అంశాలు డెల్టా వేరియంట్ వ్యాప్తికి ఏమాత్రం ప్రతిబంధకాలు కాదని వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేయగల సామర్థ్యం రోగనిరోధక వ్యవస్థకు సరిపడా స్థాయిలో లేకపోయి ఉండొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపింది.
అప్పటి వరకు ఎక్కువగా ఉన్న ఆల్ఫా వేరియంట్‌ను డెల్టా వేరియంట్ ఏప్రిల్ నెలలో అధిగమించినట్లు అధ్యయనం తేల్చింది. ఫిబ్రవరిలో 5 శాతం, మార్చిలో 10 శాతంగా ఉన్న డెల్టా వేరియంట్ వ్యాప్తి ఏప్రిల్ నాటికి 60 శాతానికి చేరుకుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో పాజిటివిటీ రేటు సైతం పెరిగిందని పేర్కొంది.