Yandamuri Veerendranath: యండమూరి దర్శకత్వంలో 'నల్లంచు తెల్లచీర'
- నవలా సాహిత్యంలో విపరీతమైన క్రేజ్
- సినిమాలుగా వచ్చిన తన నవలలు
- దర్శకుడిగానూ అనుభవం
- మరోసారి మెగాఫోన్ పట్టిన యండమూరి
యండమూరి వీరేంద్రనాథ్ ఒక తరం పాఠకులను ప్రభావితం చేసిన రచయిత. నవలా సాహిత్యంలో ఆయన స్థానం ప్రత్యేకం. ఆయన రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చాయి .. భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో అభిలాష .. ఛాలెంజ్ .. ఆఖరిపోరాటం .. దొంగమొగుడు మొదలైనవి కనిపిస్తాయి. అలాంటి యండమూరి దర్శకుడిగా కూడా ప్రయోగాలు చేశారు. తాను రచించిన 'స్టూవర్టు పోలీస్ స్టేషన్' నవలను ఆధారంగా చేసుకుని, అదే టైటిల్ తో సినిమాను తెరకెక్కించారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు.
చాలాకాలం తరువాత యండమూరి మళ్లీ ఇప్పుడు మెగాఫోన్ పట్టారు. తాను రాసిన 'నల్లంచు తెల్లచీర' నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. ఊర్వశి ఓటీటీ కోసం ఈ సినిమా నిర్మితమవుతోంది. కనగాల రవి .. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. భూషణ్ .. దియా .. జెన్నీ .. సాయికిశోర్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి, త్వరలో ఫస్టులుక్ రానుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా యండమూరికి హిట్ దక్కుతుందేమో చూడాలి.