George Floyd: ‘ఫ్లాయిడ్ ఘటన’ వీడియో తీసిన టీనేజర్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు
- డార్నెలా ఫ్రేజియర్ కు పులిట్జర్ అవార్డు
- స్పెషల్ సైటేషన్ కింద అవార్డ్
- ఆ వీడియోను ప్రసారం చేసిన ‘ద స్టార్ ట్రిబ్యూన్’కూ ప్రైజు
జార్జ్ ఫ్లాయిడ్ ఘటన.. ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. నల్లజాతీయుడైన అతడిని ఓ పోలీస్ అధికారి కిందపడేసి మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ఆ ఘటనలో తర్వాత ఫ్లాయిడ్ మరణించాడు. ఫ్లాయిడ్ ను మోకాలితో అదిమిపట్టినప్పటి దృశ్యాలతో కూడిన వీడియో బాగా వైరల్ అయింది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే ఉద్యమానికి దారి తీసింది.
అయితే, అంతటి పెద్ద ఉద్యమానికి దారితీసిన ఆ వీడియోను డార్నెలా ఫ్రేజియర్ అనే టీనేజర్ తీశారు. ఆ టీనేజర్ కు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘పులిట్జర్ ప్రైజు (జర్నలిజం)’ లభించింది. స్పెషల్ సైటేషన్ కింద ఫ్రేజియర్ కు అవార్డును అందించారు. ఇక, ఆ వీడియోను ప్రసారం చేసిన ‘ద స్టార్ ట్రిబ్యూన్’ అనే చానెల్ నూ అవార్డు వరించింది.
వాస్తవానికి ఏప్రిల్ 19నే అవార్డులను ప్రకటించాల్సి ఉన్నా.. కార్యక్రమాన్ని ఇప్పటికి వాయిదా వేశారు. ఇక, 1917 నుంచి జర్నలిజంలో పులిట్జర్ ప్రైజులను అందజేస్తున్నారు. కాగా, ఇటీవలే మినియాపోలిస్ మేయర్.. ఫ్లాయిడ్ కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు నిందితుడైన పోలీస్ అధికారి డెరెక్ చావిన్ ను విధుల నుంచి తప్పించి అరెస్ట్ చేశారు.