Digvijay Singh: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పరిశీలిస్తుందన్న దిగ్విజయ్... భగ్గుమన్న బీజేపీ

Digvijay comments on Jammu Kashmir raises anger in BJP
  • ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి
  • 2019లో ఎత్తివేసిన మోదీ సర్కారు
  • ఆర్టికల్ 370 రద్దు విచారకరమన్న దిగ్విజయ్
  • దిగ్విజయ్ పాక్ భాషలో మాట్లాడుతున్నారన్న బీజేపీ
  • మోదీ సర్కారుపై విషం కక్కుతున్నారని ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, వివాదాస్పదమైన ఆర్టికల్ 370పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపీలో ఆగ్రహావేశాలు రేకెత్తిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విచారకరమని అభిప్రాయపడ్డారు. 'క్లబ్ హౌస్' యాప్ లో ఓ పాకిస్థానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా బదులిచ్చారు.

అయితే, బీజేపీ నేతలు దిగ్విజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్థాన్ తో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం కుదుర్చుకున్న ఫలితంగానే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో పుల్వామా ఉగ్రదాడిని ప్రమాదంగా పేర్కొన్నారని, ఇప్పుడు పాక్ తో చేతులు కలిపి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నారని విమర్శించారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ జవాబు చెప్పాలని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. దిగ్విజయ్ మాత్రమే కాదు, గతంలో రాహుల్ గాంధీ, మణిశంకర్ అయ్యర్ వంటి నేతలు కూడా పాక్ భాషలోనే మాట్లాడారని అన్నారు.
Digvijay Singh
Jammu And Kashmir
Article 370
BJP
India

More Telugu News