Justice Ramana: రేపు యాదాద్రి క్షేత్రానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, గవర్నర్, సీఎం కేసీఆర్
- తెలంగాణ పర్యటనకు వచ్చిన జస్టిస్ రమణ
- యాదాద్రి క్షేత్రంలో మొక్కులు చెల్లించుకోనున్న సీజేఐ
- యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
- నేడు సీజేఐని కలిసిన కాంగ్రెస్ నేతలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. నిన్న తిరుమల నుంచి కుటుంబ సమేతంగా హైదరాబాదు చేరుకున్న జస్టిస్ రమణ రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యాక ఎన్వీ రమణ తొలిసారి తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. సీఎం కేసీఆర్ స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి సీజేఐకు స్వాగతం పలికారు.
రేపటి యాదాద్రి పర్యటనలోనూ సీఎం కేసీఆర్... సీజేఐ ఎన్వీ రమణ వెంట ఉండనున్నారు. ఈ పర్యటనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం విచ్చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ రాక నేపథ్యంలో యాదాద్రిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్న జస్టిస్ రమణ మొక్కులు చెల్లించుకుంటారని తెలుస్తోంది.
కాగా, హైదరాబాదులో నేడు సీజేఐని కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు చీఫ్ జస్టిస్ ను కలిసిన వారిలో ఉన్నారు.