Private Hospitals: ప్రైవేటు ఆసుపత్రుల్లో నిరుపయోగంగా కరోనా టీకాలు!
- మే నెలలో ప్రైవేటుకు 1.85 కోట్ల డోసుల కేటాయింపు
- వీటిలో 1.29 కోట్ల డోసులు కొనుగోలు చేసిన ప్రైవేటు
- 22 లక్షల డోసులు మాత్రమే వినియోగం
- ప్రైవేటుపై ఆసక్తి చూపని ప్రజలు
దేశవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా టీకాల కొరత ఆందోళన కలిగిస్తూనే ఉంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన టీకాలు మాత్రం నిరుపయోగంగా పడి ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత నెలలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 17 శాతం టీకా డోసులు మాత్రమే వినియోగించారు.
మే నెలలో మొత్తం 7.4 కోట్ల డోసులు దేశవ్యాప్తంగా పంపిణీ చేయగా.. వీటిలో 1.85 కోట్ల డోసులు ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించారు. వీటిలో ప్రైవేటు హాస్పిటళ్లు 1.29 కోట్ల డోసులను కొనుగోలు చేశాయి. కానీ, కేవలం 22 లక్షల డోసులు మాత్రమే ప్రజలకు అందజేశారు. అధిక ధరల మూలంగానే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం ఇటీవలే ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాల గరిష్ఠ ధరను నిర్ణయించిన విషయం తెలిసిందే. సర్వీసు ఛార్జీలు, పన్నులు కలుపుకొని కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.780, స్పుత్నిక్-వి రూ.1,145, కొవాగ్జిన్ ఒక్కో డోసు ధర రూ.1,410 గా నిర్ధారించారు. జూన్ 21 నుంచి కొత్త వ్యాక్సిన్ విధానం అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. తయారీ సంస్థల నుంచి 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన 25 శాతం టీకాలను ప్రైవేటుకు కేటాయించనున్నారు.