Megha Rajagopalan: భారత సంతతి పాత్రికేయురాలికి ప్రతిష్ఠాత్మక 'పులిట్జర్' బహుమతి
- పాత్రికేయరంగంలో అత్యున్నత పురస్కారంగా పులిట్జర్
- సాహసోపేత కథనాలు వెలువరించిన మేఘా రాజగోపాలన్
- చైనాలో ముస్లింల నిర్బంధంపై కథనాలు
- బజ్ ఫీడ్ న్యూస్ లో పనిచేస్తున్న మేఘా
పాత్రికేయ రంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారంగా భావించే పులిట్జర్ బహుమతిని భారత సంతతి జర్నలిస్టు మేఘా రాజగోపాలన్ గెలుచుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. పరిశోధనాత్మక జర్నలిజంతో ఆమె రాసిన పలు వ్యాసాలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా, చైనాలో వేలాది మంది ముస్లింలను నిర్బంధిస్తుండడాన్ని మేఘా రాజగోపాలన్ సాహసోపేతమైన రీతిలో ఎత్తిచూపారు.
చైనా అనేక రహస్య జైళ్ల వంటి నిర్మాణాలను చేపట్టి, వాటిలో మైనారిటీ ముస్లింలను చెరబట్టిందని మేఘా తన వ్యాసాల ద్వారా లోకానికి తెలియజేశారు. మేఘా ప్రఖ్యాత బజ్ ఫీడ్ న్యూస్ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
ఇక టాంపా బే టైమ్స్ పత్రికకు చెందిన నీల్ బేడీ స్థానిక రిపోర్టింగ్ అంశంలో పులిట్జర్ కు ఎంపిక కాగా, పరిశోధనాత్మక కథనాలు రూపొందించిన కాథ్లీన్ మెక్ గ్రోరీ కూడా పులిట్జర్ ప్రైజు దక్కించుకున్నారు.