Randeep Guleria: కొవిడ్ మరణాలను సరిగా గుర్తించకపోతే.. మహమ్మారి కట్టడి వ్యూహాలకు ఆటంకం: గులేరియా
- రాష్ట్రాలు కొవిడ్ మరణాలను తక్కువ చేసి చూపుతున్నాయని ఆరోపణ
- లేదంటే కొవిడ్ సంబంధిత సమాచారం అధ్యయనంలో పొరపాట్లకు చోటు
- కొవిడ్ మరణాలపై తనిఖీ అవసరం
- వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి
- 12-13 వారాల వ్యవధి సరైందే
కరోనా సంబంధిత మరణాలను ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా గుర్తించని పక్షంలో.. మహమ్మారి కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఎయిమ్స్ (దిల్లీ) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. వివిధ రాష్ట్రాలు కొవిడ్ మరణాలను తక్కువ చేసి చూపుతున్నాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లో శ్మశాన వాటికల్లో జరిగిన అంత్యక్రియలు, ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కలకు పొంతన లేదని ఇటీవల పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే.
‘‘ఒక వ్యక్తి గుండె పోటుతో మరణించాడు. ఆయనకు కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఆయనకు కొవిడ్ వల్లే గుండెపోటు వచ్చి ఉండొచ్చు. దీన్ని కొవిడ్ మరణాల కింద కాకుండా గుండెపోటు వల్ల సంభవించిన మరణంగా లెక్కగట్టవచ్చు’’ అని గులేరియా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ వివరించారు. దీని వల్ల కొవిడ్ సంబంధిత సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరిగి మహమ్మారి కట్టడి వ్యూహాలు విఫలమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరణాల తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని గులేరియా సూచించారు. దీంతో పక్కా సమాచారం అందుబాటులోకి వచ్చి సరైన వ్యూహాలు రచించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. ప్రజల వ్యవహార శైలి, వైరస్ రూపాంతరాలే పలు దఫాల వైరస్ విజృంభణకు కారణమని గులేరియా స్పష్టం చేశారు. ఇక వ్యాక్సిన్లు తీవ్ర స్థాయి కరోనా బారిన పడకుండా రక్షిస్తున్నాయని తెలిపారు. రెండు డోసుల మధ్య ఉన్న 12-13 వారాల వ్యవధి సరైనదేనని పేర్కొన్నారు. కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వ్యవధిని మార్చే అవకాశం ఉందన్నారు.