Legrad: ఆ దేశంలో రూ.12కే ఇల్లు... అయితే ఒక్కటే షరతు!
- క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ పట్టణంలో ఇళ్ల అమ్మకం
- వందేళ్లుగా తగ్గిపోతున్న జనాభా
- పాతబడిపోయిన ఇళ్లు
- ప్రజలను ఆకర్షించేందుకు అధికారుల ప్రయత్నం
క్రొయేషియాలోని లెగ్రాడ్ అనే పట్టణంలో ఇళ్లను అక్కడి ప్రభుత్వమే అతి చవకగా విక్రయిస్తోంది. గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వందేళ్లుగా ఇక్కడి జనాభా బాగా తగ్గిపోయింది. ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా ఆకర్షించేందుకు ఇళ్లను అత్యంత చవకగా విక్రయిస్తోంది. భారత కరెన్సీలో ఒక ఇంటి విలువ కేవలం 12 రూపాయలేనట. ఇప్పటివరకు 17 ఇళ్లను అమ్మినట్టు మేయర్ తెలిపారు.
అయితే, ఇక్కడ ఇళ్లు కొనదలిచిన వారికి ప్రభుత్వం ఒక ప్రధాన షరతు విధిస్తోంది. అదేంటంటే... ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న 40 ఏళ్ల లోపు వారు 15 ఏళ్లు ఇక్కడే ఉంటామని హామీ ఇస్తేనే ఇళ్లను విక్రయిస్తారు. లెగ్రాడ్ లో ని ఇళ్లన్నీ బాగా పాతబడిపోయాయి. వాటిలో చాలావరకు తలుపులు, కిటికీలు లేకుండా, గోడలు దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయట. దాంతో, ఆ ఇళ్లను బాగు చేసుకునేందుకు లెగ్రాడ్ మున్సిపాలిటీ రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తామని కూడా ప్రకటించింది.