WHO: కరోనా పుట్టుకపై పరిశోధనలకు చైనా సహకరించాలి: డబ్ల్యూహెచ్ఓ
- కరోనా మూలాల గురించి తెలుసుకోవడానికి పారదర్శకత అవసరం
- ప్రాథమిక డేటా షేరింగ్‌లో కొన్ని సమస్యలు
- మరోసారి అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి
- జీ7 నేతలు కూడా నిన్న చర్చించారు
కరోనా వైరస్ పుట్టుకపై మళ్లీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిందేనంటూ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి డిమాండ్ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఇందుకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ అన్నారు. నిన్న గ్రూప్ 7(జీ7) సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కరోనా పుట్టుక విచారణ గురించి టెడ్రోస్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ విచారణ జరగడానికి చైనా నుంచి మనకు సహకారం అందాల్సి ఉంది. కరోనా మూలాల గురించి తెలుసుకోవడానికి పారదర్శకతతో వ్యవహరించడం అవసరం. ప్రాథమిక డేటా షేరింగ్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కరోనా పుట్టుక గురించి మరోసారి అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం.. దీనిపై జీ7 నేతలు కూడా నిన్న చర్చించారు' అని టెడ్రోస్ వివరించారు.
కాగా, త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం కరోనా మూలాలపై తదుపరి పరిశోధన చేయనుంది. తొలి దశ విచారణ కోసం కొన్ని నెలల క్రితం చైనాకు వెళ్లి పరిశోధనలు చేసిన డబ్ల్యూహెచ్ఓ బృందానికి సరైన ఆధారాలు లభించలేదు. కరోనా వైరస్ ను చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించారని పలు దేశాల నిపుణులు మరోసారి వాదిస్తున్నారు. కరోనా మూలాలపై మరోసారి ఇంటలిజెన్స్ అధికారులు దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆదేశించారు.