Mumbai: దేశంలోనే తొలిసారి.. గంజాయితో కేకులు!
- ముంబయిలోని ఓ బేకరీ నిర్వాకం
- రైడ్ చేసి పట్టుకున్న నార్కోటిక్స్ బ్యూరో
- లభించిన గంజాయి కేకులు, మారిజువానా
- ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ
- గంజాయి కేకుల వల్ల ఎక్కువసేపు శరీరంపై ప్రభావం
సాధారణంగా బేకరీలో కేకులు, పఫ్‌లు, చాక్లెట్లు, ఐస్‌క్రీంలు సహా మరికొన్ని తినుబండారాలు దొరుకుతాయి. కానీ, ముంబయిలోని మాలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో మాత్రం గంజాయి, మారిజువానా వంటి మత్తుపదార్థాలు దొరుకుతున్నాయి. అదీ కేకులు, పఫ్‌ల రూపంలో పెట్టి మరీ అమ్ముతున్నారు. దేశంలో ఇలా గంజాయితో తినుబండారాలు తయారు చేయడం ఇదే తొలిసారని ముంబయి ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)’ అధికారులు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం.. బేకరీలో గంజాయితో తయారు చేసిన 10 కేకులు దొరికాయి. వీటి బరువు 830 గ్రాములు. అలాగే 35 గ్రాముల మారిజువానాను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్‌సీబీ.. ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఓ వ్యక్తి దగ్గర మరో 125 గ్రాముల మారిజువానా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గంజాయిని పొగ ద్వారా తీసుకోవడం కంటే ఆహార పదార్థంగా మార్చి తింటే దాని ప్రభావం శరీరంపై చాలా సేపు ఉంటుందని అధికారులు వివరించారు. సాధారణ తినుబండారాల నుంచి గంజాయితో చేసిన వాటిని గుర్తించడం అంత సులువు కాదని పేర్కొన్నారు.