Crocodile: మొసలి నామధేయం ఒసాబా బిన్ లాడెన్... పేరును సార్థం చేసుకున్న వైనం!

Crocodile named Osama killed so many people in Uganda

  • ఉగాండాలో రాకాసి మొసలి
  • 2005లో పట్టివేత
  • లుగాంగా గ్రామంలో మొసలి నరమేధం
  • ఇప్పటికీ అదంటే హడలిపోతున్న స్థానికులు

ఉగాండాలోని ప్రఖ్యాత విక్టోరియా సరస్సులో ఓ మొసలి సాగించిన మారణకాండ అంతాఇంతా కాదు. నాడు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బతికున్న కాలంలో ఎంతో మంది ఉగ్రవాదానికి బలయ్యారు. ఆ సమయంలో ఈ మొసలికి ఒసామా బిన్ లాడెన్ అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్టే ఈ మొసలి 80 మందిని బలిదీసుకుంది. మరో 16 భారీ జంతువులను కూడా స్వాహా చేసింది.

విక్టోరియా సరస్సు తీరప్రాంతంలో ఉండే లుగాంగా గ్రామం ఈ ఒసామా పేరు చెబితే వణికిపోతుంది. ఈ గ్రామంలో ప్రజలు ఈ మొసలి రక్తదాహానికి బలయ్యారు. ఇది చాలా తెలివైనదని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారుల పడవల కింద దాక్కుని, ఒక్కసారిగా దాడి చేసేదట. ఎంతోమంది పిల్లలను ఇది పొట్టనబెట్టుకుందని వెల్లడైంది.

కాగా, ఈ మొసలి వయసు 75 ఏళ్లు. 2005లో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి దీన్ని పట్టుకున్న అధికారులు మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇది ప్రమాదకారి అయినప్పటికీ, మొసళ్లను చంపేందుకు ఉగాండా చట్టాలు అనుమతించని కారణంగా, రాజధాని కంపాలాలోని మొసళ్ల కేంద్రానికి తరలించారు.

ఇక, ఈ రాకాసి మొసలి రాకతో మొసళ్ల పార్కుకు సందర్శకుల తాకిడి బాగా పెరిగిందట. భారీ శరీరం కలిగిన ఈ ఒసామా 16 అడుగుల పొడవుతో భీతి గొలిపేలా ఉంటుంది. కాగా, లుగంగా గ్రామస్తులు దీన్ని మృత్యుంజయురాలు అని, సాతానుకు ప్రతిరూపం అని భావిస్తుంటారు.  ఇప్పటికీ దీని ఘాతుకాలను తలచుకుని లుగాంగా గ్రామ వాసులు భీతిల్లుతుంటారు.

  • Loading...

More Telugu News