Mizoram: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆయనది.. నేడు తుదిశ్వాస విడిచారు!
- మిజోరం రాష్ట్రానికి చెందిన జియోనా చనా
- ఆయనకు మొత్తం 38 మంది భార్యలు
- 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు-మనవరాళ్లు
- 100 గదులు 4 అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబం
- అందరికీ కామన్ కిచెన్
మిజోరం రాష్ట్రానికి చెందిన జియోనా చనా పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది. ఈయనది ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం. జియోనాకు 38 మంది భార్యలు. 89 మంది పిల్లలు. 33 మంది మనవళ్లు-మనవరాళ్లు. ఇలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 76 ఏళ్ల జియోనా ఈరోజు తుదిశ్వాస విడిచారు.
జియోనా మరణాన్ని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ధ్రువీకరించారు. జియోనా కుటుంబం వల్ల మిజోరంలోని ఆయన గ్రామం పర్యాటక స్థలంగా మారిందని గుర్తుచేశారు. జియోనా మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
బీపీ, డయాబెటిస్‌తో బాధపడ్డ ఆయన ఐజ్వాల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. జియోనా ఆయన గ్రామంలో చనా అనే తెగకు పెద్దగా వ్యవహరించేవారు. ఆయన 17 ఏళ్ల వయసులో తన కంటే మూడేళ్లు పెద్దదైన ఆమెను తొలి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం 100 గదులుగల నాలుగంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. వీరందరికీ ఒకటే కామన్ కిచెన్ ఉండడం విశేషం.