Brahmam Gari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వీలునామా రాలేదు: మంత్రి వెల్లంపల్లి
- వివాదాస్పదంగా బ్రహ్మంగారి మఠం వ్యవహారం
- కొత్త పీఠాధిపతి అంశంపై అనిశ్చితి
- 90 రోజుల్లో వీలునామా అందాలన్న మంత్రి
- ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి ఎవరన్న దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇటీవల పరమపదించిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా, వారి సంతానంలో పీఠానికి అసలైన వారసులు ఎవరన్న వివాదం రూపుదాల్చింది. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు.
బ్రహ్మంగారి మఠం కొత్త పీఠాధిపతి అంశంలో తమకు ఇంకా వీలునామా అందలేదని వెల్లడించారు. దేవాదాయ చట్టం ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని తెలిపారు. వీలునామా అందకపోవడంతో నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మఠం పర్యవేక్షణకు తాత్కాలిక అధికారిని నియమించామని చెప్పారు.
మఠం ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను త్వరితగతిన సేకరిస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. బ్రహ్మంగారి మఠం అంశంలో ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. పీఠాధిపతి ఎంపిక సంప్రదాయబద్ధంగానే జరుగుతుందని స్పష్టం చేశారు.