Bandi Sanjay: అందుకే ఈటల రాజేందర్ నేడు బీజేపీలో చేరారు: ఢిల్లీలో బండి సంజయ్
- బీజేపీపై విశ్వాసంతో పార్టీలో చేరారు
- నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలని నిర్ణయం
- కాషాయ జెండా పట్టుకుని ముందుకు సాగాలని ఆకాంక్ష
- 'గడీల పాలన'ను బద్దలు కొట్టాలని నిర్ణయం
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'బీజేపీపై విశ్వాసంతో ఈటల రాజేందర్ ఈ రోజు పార్టీలో చేరారు. నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలని గొప్ప నిర్ణయం తీసుకుని, కాషాయ జెండా పట్టుకుని ముందుకు సాగాలని, తెలంగాణలో 'గడీల పాలన'ను బద్దలు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
'బీజేపీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుంది. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచంలో భారత్ శక్తిమంతంగా తయారవుతోంది. నడ్డా నేతృత్వంలో బీజేపీ మరింత శక్తిమంతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం సంతోషకరం' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.