Nara Lokesh: మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మమే గెలిచింది: నారా లోకేశ్
- హైకోర్టులో మాన్సాస్ ట్రస్టు కేసు విచారణ
- చైర్ పర్సన్ గా సంచయిత నియామకం రద్దు
- అశోక్ గజపతి పునర్నియామకంపై హైకోర్టు ఆదేశాలు
- ఈ తీర్పు సర్కారుకు చెంపపెట్టు అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకం రద్దు చేస్తూ, తిరిగి అశోక్ గజపతిరాజును చైర్మన్ గా నియమించాలంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మాన్సాస్ ట్రస్టును చెరబట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మం, చట్టం, న్యాయానిదే అంతిమ విజయం అని తేలిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, అప్రజాస్వామిక రీతిలో అర్ధరాత్రి చీకటి జీవోలు జారీ చేస్తోన్న జగన్ సర్కారుకు ఇది చెంపపెట్టు అని అభివర్ణించారు.
వేల కోట్ల ఆస్తులు, భూములు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి సత్యనిష్ఠకు న్యాయస్థానం తీర్పు మరింత వన్నె తెచ్చిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అరాచక ప్రభుత్వ పాలనపై సింహాచలం అప్పన్న ఆశీస్సులతో ప్రజాభిమానం, చట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజయం అని పేర్కొన్నారు. న్యాయపోరాటం సాగించి విజయం సాధించిన అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలియజేస్తున్నట్టు లోకేశ్ ట్విట్టర్ లో తెలిపారు.