Asaduddin Owaisi: ఈటల బీజేపీలో చేరిక నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ పరోక్ష వ్యాఖ్యలు
- కాషాయ కండువా కప్పుకున్న ఈటల
- తెలంగాణలో బీజేపీ అన్నింటా విఫలమైందన్న ఒవైసీ
- సాగర్ లో డిపాజిట్ గల్లంతు అని ఎద్దేవా
- ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారని వెల్లడి
కేంద్ర ప్రముఖుల సమక్షంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం తెలిసిందే. అయితే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై నేరుగా కాకుండా, పరోక్ష వ్యాఖ్యలు చేశారు. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తథ్యమన్న నేపథ్యంలో... తెలంగాణలో దారుణంగా విఫలమైన బీజేపీలోకి ఎవరొచ్చినా ఒరిగేదేం లేదు అనే కోణంలో విమర్శించారు. హుజూరాబాద్ లోనూ ఓటమి తప్పదన్న అభిప్రాయంతో తాజా వ్యాఖ్యలు చేశారు.
"నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి 4వ స్థానం దక్కింది. ఇవన్నీ మీరు శుభపరిణామాలు అనుకుంటున్నారు. అన్నింటా ఓడిపోయారు" అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.