Jagan: రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం... రాష్ట్ర ప్రగతికి సహకరించాలని సూచన
- గతేడాది లక్ష్యాలను సాధిస్తామన్న సీఎం జగన్
- ఈ ఏడాది కూడా అభివృద్ధి సాధిస్తామని వెల్లడి
- కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచన
- పరిశ్రమల రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ ఇవాళ రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. 2020లో లక్ష్యాలను సాధించామని, 2021లోనూ ఆశాజనకంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు కూడా సహకరించాలని సీఎం జగన్ కోరారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన మెడికల్ కాలేజీలు, జగనన్న కాలనీల అభివృద్ధి తదితర పథకాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు ఈ ఏడాది కూడా మరింత రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కూడా పాల్గొన్నారు. సీఎం జగన్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారని కన్నబాబు వెల్లడించారు. రూ.2.83 లక్షల కోట్ల రుణ ప్రణాళికను రూపొందించారని, రూ.1.48 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని మంత్రి వివరించారు.