Kadappa: పాము కాటుకు గురైన యువకుడి సాహసం... పాముని తీసుకుని ఆసుపత్రికి!
- కర్ణాటకలో ఘటన
- పొలంలో పనిచేస్తున్న వ్యక్తికి పాము కాటు
- చేతిపై కాటేసిన నాగుపాము
- పాముని ఒడిసి పట్టుకున్న యువకుడు
- సకాలంలో చికిత్స అందించడంతో తప్పిన ముప్పు
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ యువకుడ్ని నాగుపాము కాటేయగా, ఆ యువకుడు ఎంతో ధైర్యంగా పామును పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. ఉప్పరహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. అతడిని కరిచింది నాగుపాము కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ కాడప్ప ఏమాత్రం భయపడకుండా ఆ తాచుపామును పట్టుకుని స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు.
స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించడంతో, ఆ పాముతో సహా కాడప్ప బళ్లారి ఆసుపత్రికి తరలి వెళ్లాడు. తనను కరచింది ఈ పామేనని అక్కడి వైద్యులకు తెలిపాడు. దాంతో వైద్యులు వెంటనే అతడికి తాచుపాము విషానికి సంబంధించిన యాంటీ-స్నేక్ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో కాడప్పకు ముప్పు తప్పింది.
సాధారణంగా, పాము కాట్లకు గురైనప్పుడు కరిచింది ఏ పాము అనేది స్పష్టంగా చెప్పాలని వైద్యులు కోరతారు. ఒక్కో జాతి విషసర్పం కాటుకు ఒక్కో యాంటీ-స్నేక్ వీనమ్ ఔషధం ఉంటుంది. కరిచింది ఏ జాతి పామో తెలిస్తే త్వరగా చికిత్స చేసేందుకు వీలుంటుంది. అలా కాని పక్షంలో, ఆ పాము విష ప్రభావ లక్షణాలు కనిపించేదాకా ఆగి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ రెండో విధానం చాలా ప్రమాదకరం. ఆ విధంగా చూస్తే కాడప్ప సరిగ్గా వ్యవహరించాడని భావించాలి.