Novavax: క్లినికల్ ట్రయల్స్ లో 93 శాతం సమర్థత చాటిన నొవావాక్స్ కరోనా వ్యాక్సిన్
- అమెరికా, కెనడా దేశాల్లో క్లినికల్ ట్రయల్స్
- 30 వేల మంది వలంటీర్లకు డోసులు
- స్వల్ప లక్షణాలు కనిపించాయన్న ఫార్మా సంస్థ
- మూడో త్రైమాసికం నాటికి 100 మిలియన్ డోసుల తయారీ
త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ రంగప్రవేశం చేయనుంది. ప్రముఖ ఫార్మా సంస్థ నొవావాక్స్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ నొవావాక్స్ అమెరికా, మెక్సికో దేశాల్లో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ మెరుగైన రీతిలో ఫలితాలు సాధించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా అమెరికా, మెక్సికో దేశాల్లో 30 వేల మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. దాదాపు అన్ని రకాల కరోనా వేరియంట్లపై నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ 93 శాతం సమర్థతతో మెరుగైన పనితీరు కనబర్చినట్టు సదరు ఫార్మా సంస్థ వెల్లడించింది.
నోవావాక్స్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ప్రొటీన్ ఆధారితమైనది. కాగా, క్లినికల్ ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వలంటీర్లలో స్వల్ప తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు వచ్చాయని నొవావాక్స్ ఫార్మా సంస్థ వెల్లడించింది. అయితే అతి కొద్దిమందిలో మాత్రం తీవ్ర లక్షణాలు కనిపించాయట. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 100 మిలియన్ డోసులు సిద్ధం చేయాలని నొవావాక్స్ సంస్థ బావిస్తోంది .