Telangana: మరిన్ని సడలింపులకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. పగటిపూట ఆంక్షల ఎత్తివేత!
- 20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు మాత్రమే ఆంక్షలు
- కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో నిర్ణయం
- జులై 1 నుంచి 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లకు అనుమతి!
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షల్లో మరికొన్నింటిని సడలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు అమల్లో ఉంది. ఆ తర్వాతి నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు ఇది అమల్లో ఉండనుండగా, ఆ తర్వాతి నుంచి ఉదయం పూట నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 20 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే, సడలింపుల్లో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైలు సర్వీసు వేళలను పొడిగించనున్నారు. పార్కులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, ఈ-పాస్ నిబంధనలను కూడా ఎత్తివేయనున్నారు. జులై 1 నుంచి పబ్‌లు, జిమ్‌లతోపాటు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే సడలింపులు ఉండగా, దీనిని కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.