Sharmila: 50 వేల పోస్టులు అని అర చేతిలో వైకుంఠం చూపి 6 నెలలు గడిచిపోయింది: వైఎస్ షర్మిల
- త్వరలో.. త్వరలో ఉద్యోగాల భర్తీ అంటున్నారు
- అయినా అడుగు ముందుకు పడింది లేదు
- కేసీఆర్ సారుకు గిట్టని వారిపై కంప్లైంట్ వస్తే అరక్షణంలో స్పందిస్తరు
- నిరుద్యోగులు చనిపోతున్నా కేసీఆర్ సారు స్పందించరు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తామని, వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా వేశామని గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని, ఇప్పటివరకు భర్తీ చేయలేదని వచ్చిన ఓ వార్తను వైఎస్ షర్మిల పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ఆమె నిలదీశారు.
'త్వరలో.. త్వరలో.. త్వరలో.. 50 వేల పోస్టులు అని అర చేతిలో వైకుంఠం చూపి 6 నెలలు గడిచిపోయింది .. అయినా అడుగు ముందుకు పడింది లేదు. కేసీఆర్ సారుకు గిట్టని నాయకుల మీద కంప్లైంట్ వచ్చుడే ఆలస్యం.. అరక్షణంలో స్పందిస్తరు.. అధికార యంత్రంగానంతా కదిలిస్తరు' అని షర్మిల విమర్శలు గుప్పించారు.
'ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వండని నిరుద్యోగులు చనిపోతున్నా కేసీఆర్ సారు స్పందించరు. 50 వేల పోస్టులను కాదు .. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను నింపాల్సిందే' అని షర్మిల డిమాండ్ చేశారు.