Andhra Pradesh: ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు త్వరగా టీకా ఇవ్వండి: ఆదేశించిన ఏపీ మంత్రుల కమిటీ
- కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై అధికంగా పడే అవకాశం ఉందంటూ వార్తలు
- ఎదుర్కొనేందుకు అప్రమత్తమైన ప్రభుత్వం
- జనావాసాలకు సమీపంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు వీలైనంత వేగంగా టీకాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వెంట తల్లులు ఉండాల్సి వస్తుందని, కాబట్టి వారికి తొలుత టీకాలు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో నిన్న వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. కరోనా థర్డ్ వేవ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించింది. వైరస్ బారినపడే పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని అధికారులను కోరింది. అలాగే, జిల్లా కేంద్రాల్లో జనావాసాలకు సమీపంలో ‘హెల్త్ హబ్స్’ ఏర్పాటు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.