Nara Lokesh: విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే మా పార్టీ చూస్తూ ఊరుకోదు: నారా లోకేశ్ హెచ్చరిక
- ఇంటర్ పరీక్షలు నిర్వహించొద్దు
- విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు
- మంత్రి సురేశ్ చేస్తోన్న ప్రకటనలు సరికావు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పరీక్షలను రద్దు చేయాలని మొదటి నుంచీ డిమాండ్ చేస్తోన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఈ రోజు "ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు - విద్యా సంవత్సరం వృథా" అనే అంశంపై విద్యార్థులు, విద్యావేత్తలతో వర్చువల్ పద్ధతిలో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.
కరోనా వ్యాప్తి వేళ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు.
పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సురేశ్ చేస్తోన్న ప్రకటనలు సరికావని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్ విజృంభణ అధికంగా ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించడం సరికాదని విద్యావేత్తలు అన్నారు. కావాలంటే ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ వంటి వాటిపై ఆలోచించాలని కోరారు. తమ కోసం ఫైట్ చేస్తున్నందుకు లోకేశ్ కు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఓ విద్యార్థిని పేర్కొంది. ప్రభుత్వం కొంచమైనా ఆలోచించాలని కోరింది.