Mayur: ఇన్ స్టాగ్రామ్ లో లోపాన్ని పట్టేసి భారీ నజరానా కొట్టేసిన షోలాపూర్ కుర్రాడు!

Sholapur youth identified the bug in Instagram
  • ఇన్ స్టాగ్రామ్ లో బగ్
  • ప్రైవేటు అకౌంట్లను తెరిచేందుకు వీలు
  • ఫేస్ బుక్ దృష్టికి తీసుకెళ్లిన మయూర్
  • రూ.22 లక్షలు అందించిన ఫేస్ బుక్
సోషల్ మీడియా వేదికలపై భద్రత కూడా చాలా ముఖ్యం. యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంటాయి. చిన్న బగ్ చాలు... యావత్ సైట్ హ్యాకర్ల పరమవుతుంది. అందుకే బగ్ లు కనుగొనే వారికి నజరానా ఇస్తామంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రకటనలు చేస్తుంటాయి.

తాజాగా, మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన మయూర్ అనే కుర్రాడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ కీలక లోపాన్ని గుర్తించాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఉండే ప్రైవేటు ఖాతాలను ఫాలో అవకుండానే వారి అకౌంట్లలోని వ్యక్తిగత ఫొటోలు, ఇతర సమాచారం తస్కరించేందుకు ఉపకరించే బగ్ ను మయూర్ కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇది సాధ్యమవుతోందని తెలుసుకున్నాడు. భద్రతాపరంగా ఇది కీలకమైన విషయం కావడంతో ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ మయూర్ కు రూ.22 లక్షల బహుమానం అందించింది.

గత ఏప్రిల్ లో మయూర్ ఈ లోపాన్ని ఫేస్ బుక్ దృష్టికి తీసుకెళ్లగా, ఫేస్ బుక్ వెంటనే ఆ లోపాన్ని సవరించుకుని తద్వారా యూజర్ల ప్రైవసీని కాపాడింది. అంతేకాదు, ఇకముందు కూడా ఏవైనా లోపాలు ఉంటే తమకు వెంటనే సమాచారం అందించాలని ఫేస్ బుక్ మయూర్ కు లేఖ రాసింది. 21 ఏళ్ల మయూర్ కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ అవ్వాలనేది అతడి ఆకాంక్ష. అయితే, బగ్ బౌంటీ (లోపాలు గుర్తించే కార్యక్రమం)ని పార్ట్ టైమ్ పనిగానే భావిస్తానని స్పష్టం చేశాడు.
Mayur
Instagram
Bug
Facebook
Sholapur
Maharashtra

More Telugu News