Modi: భారత్‌లో పెట్టుబడులు పెట్టండి.. ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు

Modi calls world to invest India

  • కొవిన్‌ యాప్‌ విజయాన్ని ఉదహరించిన ప్రధాని
  • వైవాటెక్‌ సదస్సులో మోదీ కీలకోపన్యాసం
  • భారత్‌, ఫ్రాన్స్ మధ్య సహకారం కొనసాగుతోందని వ్యాఖ్య
  • భారత్‌ అంకుర సంస్థల కేంద్రంగా అభివర్ణన
  • రిపేర్‌ అండ్‌ ప్రిపేర్‌పైనే దృష్టి సారించాలని హితవు

కరోనాపై భారత్ చేస్తున్న పోరులో దేశీయంగా తయారు చేసిన కొవిన్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికత సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘వైవాటెక్‌’ సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆయన భారత్‌, ఫ్రాన్స్‌ అనేక అంశాల్లో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటిలో సాంకేతికత, డిజిటల్‌ రంగాల్లో సహకారం కొత్తపుంతలు తొక్కుతున్నాయన్నారు.

‘‘టాలెంట్‌, మార్కెట్‌, క్యాపిటల్‌, ఎకో సిస్టం, కల్చర్ ఆఫ్‌ ఓపెనెస్‌’’ వంటి ఐదు కీలక అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ ఆహ్వానించారు. ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు కావాల్సిన అనువైన వాతావరణాన్ని కల్పించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.  

భారత్‌ అంకుర సంస్థల కేంద్రంగా ఉందని మోదీ గుర్తుచేశారు. అనేక అంకుర సంస్థలు ఇటీవల యునికార్న్‌(1 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ గల సంస్థలు)గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. సంప్రదాయం పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు, నవకల్పనలే పరిష్కారం చూపుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు.

గత ఏడాది కాలంగా అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మోదీ గుర్తుచేశారు. ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోందన్నారు. అయితే, దీనితో నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘బాగుచేయడం, సన్నద్ధంగా ఉండడం’(రిపేర్‌ అండ్‌ ప్రిపేర్‌) అనే ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మహమ్మారి తర్వాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకొని అధిక వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని మోదీ తెలిపారు.

ఐరోపాలో అతిపెద్ద డిజిటల్‌, స్టార్టప్‌ కార్యక్రమం ఈ వైవాటెక్‌ సదస్సు. 2016 నుంచి ప్రతి సంవత్సరం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ సహా కార్పొరేట్‌ దిగ్గజాలు టిమ్‌ కుక్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, బ్రాడ్‌ స్మిత్‌ వంటివారు సైతం ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News