Apex Council: హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై వేటు!
- వివాదాలకు మరోపేరుగా హైదరాబాద్ క్రికెట్ సంఘం
- కొన్నాళ్ల కిందట అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అజర్
- మరింత భగ్గుమన్న వివాదాలు
- అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అపెక్స్ కౌన్సిల్
- షోకాజ్ నోటీసులు జారీ
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే వేటు పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజార్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో అజర్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. అజ్జూ భాయ్ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు భగ్గుమన్నాయి.
ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ అందుకు వేదికగా నిలిచింది. అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. ఈ నేపథ్యంలోనే వేటు పడినట్టు అర్థమవుతోంది. తాజాగా అజర్ కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది.