Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సోము వీర్రాజు.. అన్నీ కేంద్రమే ఇస్తే మీరేం చేస్తారంటూ నిలదీత
- ఆస్తిపన్ను పెంపు, చెత్త పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసన
- కరోనా కాలంలో ఇది సరికాదన్న సోము వీర్రాజు
- ‘జగనన్న గిచ్చుడు-జగనన్న బాదుడు’ పేరు పెట్టాలని జీవీఎల్ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆస్తి పన్ను విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిన్న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది.
‘అన్న వచ్చాడు, పన్ను పెంచాడు’, 'ఉచితాలు ఇచ్చుడు, పన్నులు పెంచుడు’ పేరుతో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్నుపై ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో రోడ్లు, పార్కులు, కాలువల నిర్మాణానికి అమృత్ పథకంకు 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రమే నిధులిస్తే మరి మీరేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా పన్నులు పెంచి భారం మోపడం సరికాదని అన్నారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ నిధులు ఇస్తున్నారో తేల్చేందుకు చర్చకు సిద్ధమా? అని సోము వీర్రాజు సవాలు విసిరారు.
విశాఖపట్నంలో ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు నిరసన ప్రదర్శనలో పాల్గొనగా, గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు పాల్గొన్నారు. పన్నుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఉచిత పథకాలకు జగన్ పేరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచే కార్యక్రమానికి ‘జగనన్న గిచ్చుడు.. జగనన్న బాదుడు’ పేరు పెడితే బాగుంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఆస్తిపన్ను పెంపు రాష్ట్ర ప్రభుత్వంలోని అంశమని, కేంద్ర నిర్ణయమైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పెంచలేదని ప్రశ్నించిన జీవీఎల్.. ఆస్తిపన్ను పెంపుపై అబద్ధాలు చెబుతున్న బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.