Twitter: ట్విట్టర్​ ఇండియా అధిపతి, నటి స్వర భాస్కర్​ పై ఢిల్లీలో ఫిర్యాదు

Complaint against Swara Bhaskar Twitter India head

  • ఘాజియాబాద్ వీడియోను వైరల్ చేశారని ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
  • ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడి

ట్విట్టర్ కు వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. నూతన ఐటీ చట్టాల అమలుపై ట్విట్టర్ ఎలాంటి స్పందననూ చెప్పకపోతుండడంతో ఆ సంస్థకు లీగల్ ప్రొటెక్షన్ (న్యాయ సాయం)ను కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఎవరు, ఏ ట్వీట్ చేసినా దానికి సంస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో ఘాజియాబాద్ దాడి ఘటనకు సంబంధించిన వీడియోపై యూపీలో నిన్ననే ట్విట్టర్ పై తొలికేసు నమోదైంది.

తాజాగా అదే వీడియోకు సంబంధించి అమిత్ ఆచార్య అనే అడ్వొకేట్ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ భారత అధిపతి మనీశ్ మహేశ్వరితో పాటు ట్విట్టర్ అధికారి ఆసిఫ్ ఖాన్, నటి స్వర భాస్కర్, జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షెర్వానీలపై ఫిర్యాదునిచ్చారు. అది ఫేక్ అని తేలినా కూడా వీడియోను మళ్లీ మళ్లీ షేర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించారు.

కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ వార్తా సంస్థ, పలువురు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తనను కొట్టారని, జై శ్రీరామ్ అనాలంటూ దాడి చేశారంటూ పేర్కొన్న ఓ వృద్ధుడి వీడియోను వారు పోస్ట్ చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆ వీడియోను వారు పోస్ట్ చేశారంటూ ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News