Ashok Gajapathi Raju: దోపిడీదారులకు మాన్సాస్‌లో స్థానం లేదు: అశోక్ గజపతిరాజు ఆగ్రహం
- మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజు సంతకం
- ఆడిట్ జరగలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయా
- మాన్సాస్ ఛైర్మన్‌గా విద్యకే తొలి ప్రాధాన్యం
- విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తాం
హైకోర్టు తీర్పుతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మళ్లీ మాన్సాస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మాన్సాస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ అశోక్ గజపతిరాజు ఈ రోజు సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ, మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని, ఇందుకోసం ప్రతి ఏడాది సంస్థ ఫీజు కూడా అధికారికంగా చెల్లించిందని తెలిపారు.
దోపిడీదారులకు మాన్సాస్‌లో స్థానం లేదన్నారు. మాన్సాస్ ఛైర్మన్‌గా విద్యకే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అలాగే, విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని తెలిపారు. రామతీర్థంలో రాముడి ప్రతిమపై దాడి చేసి దుండగులు స్వామివారి శిరస్సును తీసుకెళ్లారని ఆయన గుర్తు చేశారు.
రామతీర్థం విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించినప్పుడు ఆ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని చెప్పారు. తాను ఆ ఆలయానికి విరాళం ఇచ్చినా తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. దీంతో ఆ విరాళం అయోధ్య రామాలయానికి ఇచ్చానని చెప్పారు. అంతేగాక, సింహాచలం దేవస్థానం ఈవో కూడా తనను కలవడానికి ఇష్టపడలేదని తెలిపారు.