Jagan: నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎనలేని మేలు: సీఎం జగన్
- నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష
- నూతన విద్యావిధానంపై చర్చ
- తర్వాతి తరాలకు కూడా మేలు జరుగుతుందని వెల్లడి
- రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ఏపీ విద్యాశాఖ, అంగన్ వాడీల్లో నాడు-నేడు కార్యాచరణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన విద్యావిధానం ప్రాశస్త్యాన్ని నొక్కి చెప్పారు. నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎనలేని మేలు జరుగుతుందని అన్నారు. ఇప్పటివారికే కాదు తర్వాతి తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
నూతన విద్యావిధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని, నూతన విద్యావిధానం వల్ల జరిగే మేలును వారికి వివరించాలని సూచించారు.
మండలానికి ఒకటి, లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాకానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, బూట్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.
ఇక, అంగన్ వాడీ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క అంగన్ వాడీ కేంద్రాన్ని మూసివేయడంలేదని, ఏ ఒక్క అంగన్ వాడీ ఉద్యోగిని తొలగించబోవడంలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.