WHO: కొవాగ్జిన్ దరఖాస్తు పరిశీలనకు ఆమోదం తెలిపిన డబ్ల్యూహెచ్ఓ
- కొవాగ్జిన్ ను రూపొందించిన భారత్ బయోటెక్
- భారత్ లో వినియోగం
- విదేశాల్లో వినియోగం కోసం డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు
- అదనపు సమాచారం కోరిన డబ్ల్యూహెచ్ఓ
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అంతర్జాతీయ వినియోగం కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దరఖాస్తు పరిశీలనకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొవాగ్జిన్ ను భారత్ లో వినియోగిస్తుండగా, ఇతర దేశాల్లో వినియోగించేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి తప్పనిసరి. అందుకే అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కొన్నిరోజుల కిందట భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు చేసింది.
అయితే, పలు దశల క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమగ్ర సమాచారం లోపించిందని డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ కోరిన అదనపు సమాచారాన్ని భారత్ బయోటెక్ పంచుకోవడంతో దరఖాస్తు పరిశీలనకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో ఈ నెల 23న కీలక సమావేశం జరగనుంది. కొవాగ్జిన్ కు సంబంధించిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి సమాచారాన్ని ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రక్రియ పూర్తయితే... కొవాగ్జిన్ అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ దాఖలు చేసిన దరఖాస్తును డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అపై అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస్తారు.
దీనిపై భారత్ బయోటెక్ కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ... గతంలో తాము అభివృద్ధి చేసిన టైఫాయిడ్, పోలియో, రోటా వైరస్ వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు మంజూరు చేసిందని, ఇప్పుడు కొవాగ్జిన్ విషయంలోనూ తమకు ఎలాంటి సందేహాలు లేవని పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, తమ సంస్థకు ఇదేమీ కొత్త కాదని అన్నారు.