India: భారత్ వర్సెస్ న్యూజిలాండ్... డబ్ల్యూటీసీ ఫైనల్ కు సర్వం సిద్ధం
- రేపు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
- టీమిండియాతో కివీస్ అమీతుమీ
- సౌతాంప్టన్ లో టైటిల్ సమరం
- విజయం కోసం ఉరకలేస్తున్న ఇరు జట్లు
- కీలకంగా మారనున్న వాతావరణం!
క్రికెట్లో ప్రతి ఫార్మాట్ కు ఓ కప్పు ఉండాలన్న ఐసీసీ ఆలోచన లోంచి పుట్టిందే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్. సుదీర్ఘకాలం జరిగే ఈ చాంపియన్ షిప్ లో తొలిసారిగా టీమిండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా రేపు (జూన్ 18) ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక సమరం కోసం ఏజీస్ బౌల్ స్టేడియం సుందరంగా ముస్తాబైంది. ఇక, ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగానే సన్నద్ధమయ్యాయి. ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.11 కోట్ల నజరానా ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టు రూ.5 కోట్లు దక్కించుకుంటుంది.
ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ జట్టుతో రెండు టెస్టులాడి విశేషరీతిలో మ్యాచ్ ప్రాక్టీసు పొందింది. పైగా ఆ సిరీస్ లో ఇంగ్లండ్ ను వారి సొంతగడ్డపైనే ఓడించి తిరుగులేని ఆత్మవిశ్వాసం అందుకుంది. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, లాథమ్, కొత్త ఆటగాడు డెవాన్ కాన్వోయ్ లతో కివీస్ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తొలి విదేశీ పర్యటనలోనే కాన్వోయ్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ లు ఆడాడు. బౌలింగ్ లోనూ కివీస్ ను తక్కువ అంచనా వేయలేం. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారు. ఇటీవల జట్టులోకి వచ్చిన కైల్ జేమీసన్ అటు బంతితో, ఇటు బ్యాట్ తోనూ విశేషంగా రాణిస్తుండడం ఆ జట్టుకు అదనపు బలం.
టీమిండియా విషయానికొస్తే... ఐపీఎల్ అర్థాంతరంగా నిలిచిపోయాక ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీసు లేకుండా పోయింది. నేరుగా ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు... రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడారు. ఇక టీమిండియా తుది జట్టు ఎంపిక విషయానికొస్తే... రేపటి మ్యాచ్ లో రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయమే. మిడిలార్డర్ లో హనుమ విహారి స్థానంలో బౌలింగ్, బ్యాటింగ్ చేయగల రవీంద్ర జడేజాను తీసుకున్నారు.
ఆ విషయం అటుంచితే... కెప్టెన్ కోహ్లీ, పుజారా, రహానే, రిషబ్ పంత్ లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోసారి భారత్ ప్రపంచస్థాయి బౌలింగ్ దళాన్ని ఈ మ్యాచ్ కోసం రంగంలోకి దింపుతోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వంటి ప్రతిభావంతులైన పేసర్లు భారత్ కు అందుబాటులో ఉన్నారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జడేజా ఉండనే ఉన్నారు.
ఏదేమైనా, రేపు ప్రారంభమయ్యే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో హోరాహోరీ పోరు తథ్యమని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. అయితే, ఇంగ్లండ్ లో వాతావరణం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడక్కడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో, ఫైనల్ మ్యాచ్ పైనా వరుణుడి ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.