Dmestic airlines: మే నెలలో గణనీయంగా పడిపోయిన దేశీయ విమాన ప్రయాణాలు
- 21.15 లక్షల మంది ప్రయాణం
- ఏప్రిల్‌లో 57.25 లక్షల మంది ప్రయాణం
- విమానయానంపై కరోనా రెండో దశ వ్యాప్తి ప్రభావం
- మొత్తం ప్రయాణాల్లో 55.3 శాతం ఇండిగోలోనే
- ఎయిరిండియాలో 4.29 లక్షల మంది ప్రయాణం
- మే నెల గణాంకాలు వెల్లడించిన డీజీసీఏ
మే నెలలో దేశీయంగా 21.15 లక్షల మంది విమాన ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-(డీజీసీఏ) వెల్లడించింది. ఏప్రిల్‌లో ప్రయాణించిన 57.25 లక్షల మందితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 63 శాతం తగ్గినట్లు పేర్కొంది. అదే మార్చిలో 78.22 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిపింది.
మేలో ప్రయాణికుల సంఖ్య పడిపోవడానికి కరోనా రెండో దశ విజృంభణే కారణమని డీజీసీఏ వెల్లడించింది. రెండో దశ కరోనా ప్రభావం విమానయానంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. మే నెలలో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో 11.69 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిపింది. దేశీయ విమాన ప్రయాణాల్లో 55.3 శాతం వాటా ఇండిగోదేనని వెల్లడించింది.
ఇక స్పైస్ జెట్‌లో 1.99 లక్షల మంది, ఎయిరిండియాలో 4.29 లక్షలు, గో ఫస్ట్‌లో 1.38 లక్షలు, విస్తారాలో 97 వేలు, ఎయిర్ ఏషియా ఇండియాలో 64 వేల మంది ప్రయాణించారని డీజీసీఏ వెల్లడించింది. దేశంలోని ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేటు 39.3 శాతం నుంచి 64 శాతం మధ్య ఉందని తెలిపింది. అత్యధికంగా స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ 64 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.