LJP: ఎల్‌జేపీ నూతన అధ్యక్షుడిగా పశుపతి కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ భేటీలో ఎన్నిక
- రాజ్యాంగ విరుద్దమన్న చిరాగ్ పాశ్వాన్
- పారస్‌కు వ్యతిరేకంగా పాట్నాలో నిరసన ప్రదర్శనలు
లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) తిరుగుబాటు నేత, ఎంపీ పశుపతి కుమార్ పారస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పారస్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వర్గంలో తనకు కనుక స్థానం దక్కితే పార్లమెంటులో పార్టీ నేత పదవిని వదులుకుంటానని పేర్కొన్నారు. కాగా, పశుపతి పారస్‌కు వ్యతిరేకంగా పాట్నాలోని పలు ప్రాంతాల్లో చిరాగ్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
పశుపతి పారస్ ఎన్నికను చిరాగ్ పాశ్వాన్ తిరస్కరించారు. జాతీయ కార్య నిర్వాహక వర్గం భేటీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆదేశాలతోనే పశుపతి వర్గం పార్టీలో తిరుగుబాటు చేసిందని ఆరోపించారు. పార్టీ అసలైన కార్య నిర్వాహక వర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరుగుతుందన్నారు.