Devineni Uma: దేవినేని ఉమపై మరో కేసు నమోదు
- ఈ నెల 16న మైలవరంలో టీడీపీ శ్రేణుల ఆందోళన
- కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసులు
- సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసుల నమోదు
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఉమతో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కృష్ణా జిల్లాలోని మైలవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 16న టీడీపీ పిలుపు మేరకు మైలవరంలో ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు.
కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని, ఆక్సిజన్ అందక మరణించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరచాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు తహసీల్దార్ కు వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే, టీడీపీ నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసులు బుక్ చేశారు.