India: సరిహద్దుల్లో చైనాకు దీటుగా భారత్ దూకుడు!
- నిన్ననే 12 రహదారుల ప్రారంభం
- ఎత్తైన ప్రాంతాలకు బలగాలను వేగంగా తరలించేలా ఏర్పాట్లు
- బలగాల కోసం మరిన్ని నిర్మాణాలు
- ఇప్పటిదాకా 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు
- కీలకమైన పాస్ లకు అనుసంధానం
ఈస్టర్న్ లడఖ్ నుంచి బలగాలను వెనక్కు తీసుకున్నట్టే తీసుకుని.. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు దీటుగా భారత్ కూడా ముందుకెళ్తోంది. అత్యవసర సమయాల్లో బలగాలను, ఆయుధాలు, ఆయుధ సామగ్రిని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు శరవేగంగా నిర్మాణాలు చేపడుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా హెలిప్యాడ్లు, భూమి నుంచి ప్రయోగించే క్షిపణుల కోసం సైట్లు, రోడ్ల నిర్మాణం, బలగాల కోసం నిర్మాణాలను చేపడుతుండడంతో భారత్ కూడా దీటుగా ముందుకెళ్తోంది. .
సరిహద్దు రహదారుల దగ్గర్నుంచి.. వంతెనల దాకా నిర్మాణాలను చేస్తోంది. ఇప్పటికే 60 వేల దాకా బలగాలు అక్కడ నిరంతరం పహారా కాస్తున్నాయి. చైనాతో పోలిస్తే సరిహద్దుల వెంబడి మౌలిక వసతుల కల్పన విషయంలో మనం వెనుకబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలోనే సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్వో) నిర్మించిన 12 రహదారులను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. అందులో 9 రహదారులు అరుణాచల్ ప్రదేశ్, కిమిన్–పొతిన్ లో రెండు లేన్ల రోడ్డు, లడఖ్, జమ్మూకశ్మీర్ లో ఒక్కోటి చొప్పున రోడ్లు రెడీ అయిపోయాయి.
హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెంచోక్ నుంచి సైన్యం ఉపసంహరణకు చైనా నిరాకరిస్తుండడం, పైగా ఎక్కువ మంది బలగాలను మోహరిస్తుండడంతో సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతపై చర్చించేందుకు రెండ్రోజుల ఆర్మీ కమాండర్ల సమావేశాన్ని సైన్యాధిపతి జనరల్ ఎంఎం. నరవాణే ప్రారంభించారు.
ఏడాదిలో భారత్ 1,200 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణ పనులు, 2,850 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం చదును చేయడం వంటి పనులను పూర్తి చేసింది. 1,200 కిలోమీటర్ల రోడ్లలో కేవలం 162 కిలోమీటర్లే రాజస్థాన్ లోని సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. మిగతా అంతా అత్యంత కీలకమైన జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉన్నాయి.
అయితే, 4,363 కిలోమీటర్ల మేర చాలా నిదానంగా నడుస్తున్న 73 వ్యూహాత్మకంగా ముఖ్యమైన రోడ్ల నిర్మాణంలో వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. వాటిని 1999లోనే ఆమోదించారని అంటున్నారు. అందులో ఇప్పటిదాకా పనులు పూర్తయినవి కేవలం 45 రోడ్లేనట. 59 రోడ్లకు సంబంధించి రాకపోకలు పెరిగాయంటున్నారు. మరికొన్ని రోడ్లు 2022, 2023 నాటికి అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
ఇక, ఇప్పటికే బీఆర్వో 74 వంతెనలను, 33 బైలీ వంతెనలను సరిహద్దుల్లో నిర్మించింది. వీటి ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని యాంగ్సేకి కనెక్టివిటీ ఏర్పడిందని చెబుతున్నారు. వాటితో పాటు ఎత్తైన ప్రదేశాలైన జోజిలా పాస్, లాచుంగ్ లా, షింకున్ లా, బరాల్చా లా, నాకీ లా వంటి పాస్ లకూ అనుసంధానం పెరిగిందని వివరించారు.