Arul Pranesh: పెళ్లి ఖర్చు రూ.50 లక్షలకు అంచనా... రూ.13 లక్షలతోనే పెళ్లి చేసుకుని మిగతా డబ్బు విరాళం ఇచ్చిన కొత్త జంట
- కరోనా వేళ ఆదర్శంగా నిలిచిన యువజంట
- తిరుప్పూర్ లో ఈ నెల 14న పెళ్లి
- ఓ గుళ్లో పెళ్లి చేసుకున్న వైనం
- రూ.37 లక్షలు విరాళం
కరోనా సంక్షోభ సమయంలో తమిళనాడుకు చెందిన ఓ కొత్త జంట ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచింది. తమ పెళ్లిని తక్కువ ఖర్చుతో జరుపుకుని, మిగతా డబ్బును విరాళంగా ఇచ్చేసిన ఆ వధూవరులు అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు.
తిరుప్పూర్ కు చెందిన అరుల్ ప్రాణేశ్, అను ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసుకున్నారు. తమ పెళ్లిని వీలైనంత తక్కువ ఖర్చుతో జరుపుకుని, మిగిలిన డబ్బును, కరోనా సహాయక చర్యలకు అందించాలని నిర్ణయించుకున్నారు.
కొవిడ్ భయంతో పలువురు ఆహ్వానితులు పెళ్లికి రాకపోగా, మ్యారేజి హాల్ ఓనర్ కూడా అడ్వాన్సు వెనక్కి ఇచ్చేశారు. దాంతో అరుల్ ప్రాణేశ్, అను జోడీ తిరుప్పూర్ లోని వట్టెమాలై అంగళమ్మన్ ఆలయంలో జూన్ 14న అతి తక్కుమంది సమక్షంలో ఒక్కటయ్యారు.
అన్ని ఖర్చులు కలిపి వీరి పెళ్లికి రూ.13 లక్షలు ఖర్చు కాగా, మిగిలిన రూ.37 లక్షలను విరాళంగా ఇచ్చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాలకు వినియోగించేలా ఆ డబ్బును స్థానిక రోటరీ క్లబ్ కు అందజేశారు. ఎంతో సామాజిక స్పృహతో ఆలోచించిన అరుల్ ప్రాణేశ్, అనులపై అభినందనల వర్షం కురుస్తోంది.