IT Services: తమ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసిన విప్రో!
- 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు
- బ్యాండ్ బి3, కిందిస్థాయి వారికి సెప్టెంబరు నుంచి అమలు
- సి1 కంటే పై స్థాయి వారికి జూన్ నుంచి వర్తింపు
- ఈ క్యాలండర్ సంవత్సరంలో రెండోసారి వేతన పెంపు
దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు వేతనం పెంచనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 1, 2021 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఈ క్యాలండర్ సంవత్సరంలో వేతనాలు పెంచడం ఇది రెండోసారి.
బ్యాండ్ బి3 కంటే కిందిస్థాయి(అసిస్టెంట్ మేనేజర్ కంటే కిందిస్థాయి) ఉద్యోగులకు ‘మెరిట్ శాలరీ ఇంక్రీజెస్(ఎంఎస్‌ఐ)’ ప్రాతిపదికన వేతనాలు పెంచనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. సీ1(మేనేజర్లు, ఆపై స్థాయి) కంటే పై స్థాయి ఉద్యోగులకు ఈ పెంపు జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఉద్యోగుల పనితీరు, స్థాయిని బట్టి పెంపు ఉండనున్నట్లు సమాచారం.
గత ఏడాది వ్యవధిలో రెండోసారి వేతనాలను పెంచిన ఐటీ సంస్థ విప్రో. ఇప్పటికే టీసీఎస్ తమ ఉద్యోగులకు తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు వేతనాలను పెంచింది. రెండు విడతల్లో కలిపి టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు దాదాపు 12-14 శాతం మేర పెరగడం విశేషం.