Nadendla Manohar: ఉద్యోగాల భర్తీపై రెండేళ్ల తర్వాత వైసీపీ మాట మార్చి మడమ తిప్పింది: నాదెండ్ల మనోహర్
- జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
- విమర్శలు గుప్పించిన నాదెండ్ల
- నిరుద్యోగులను మోసం చేశారని వ్యాఖ్యలు
- ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలిస్తామన్నారని వెల్లడి
సీఎం జగన్ నేడు రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏపీపీఎస్సీ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత వైసీపీ మాట మార్చి మడమ తిప్పిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం అనేక ముహూర్తాలు మార్చి, చివరికి ఈ రోజు ప్రకటించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారని పేర్కొన్నారు.
లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2లో కేవలం 36 పోస్టులు మాత్రమే చూపిస్తున్నారని, దీన్నిబట్టే వైసీపీ సర్కారు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి ఏటా ఖాళీ అవుతూనే ఉంటాయని, ఆ ఖాళీలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ పోస్టులు కూడా వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
ఇవాళ ప్రభుత్వం చేసిన ప్రకటనలో 2.59 లక్షల వలంటీర్ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటోందని, ఇదే వలంటీర్లు జీతాలు పెంచాలని ఆందోళనలకు దిగితే, మీవి ఉద్యోగాలు కావు స్వచ్ఛంద సేవలు మాత్రమే అని స్వయంగా సీఎం ప్రకటించారని నాదెండ్ల వివరించారు. జాబ్ క్యాలెండర్ ప్రచారం కోసం వలంటీర్లవి ఉద్యోగాలు అంటున్నారని, ఉద్యోగాలే అయితే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో 51 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని తామే నియమించినట్టు చెప్పుకోవడం విచిత్రమని తెలిపారు. ఎవరిని మోసం చేయాలని ఈ ప్రయత్నం అంటూ నిలదీశారు.
శాఖల వారీగా భర్తీ చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వం, పోస్టుల ఖాళీలు చాలా తక్కువ చేసి చూపించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు... ఇలా అనేక పోస్టులు ఉంటే, వాటి ప్రస్తావనే లేకుండా జాబ్ క్యాలెండర్ రూపొందించారని విమర్శించారు. రాష్ట్రంలో శాఖల వారీగా ఉన్న ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.