Corona vaccine: ఫైజర్, మోడెర్నా కరోనా టీకాల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు!: తాజా అధ్యయనంలో వెల్లడి
- స్పష్టం చేసిన ఓ అధ్యయనం
- శుక్రకణాల సంఖ్యలో మార్పు లేదని వెల్లడి
- సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయించే ఇతర పరామితుల్లోనూ లేని మార్పు
- టీకా తీసుకున్న 18-50 ఏళ్ల మధ్య వయసు వారిపై అధ్యయనం
ప్రముఖ ఔషధ తయారీ సంస్థలు ఫైజర్, మోడెర్నా రూపొందించిన కరోనా టీకాలు పురుషుల్లో సంతాన సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపవని ఓ అధ్యయనం తేల్చింది. ఈ టీకాలు తీసుకున్నవారిలో శుక్రకణాల సంఖ్య ఆరోగ్యకర స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు గురువారం ‘జామా’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
టీకా తీసుకున్న 18-50 ఏళ్ల మధ్య వయసు వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఎలాంటి సంతానపరమైన సమస్యలు లేని 45 మంది నుంచి టీకా ఇవ్వక ముందు, తర్వాత వీర్యాన్ని సేకరించారు. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల మేరకు ఆ నమూనాలను పరీక్షించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయించే అన్ని పరామితులను నమోదు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తర్వాత ఎలాంటి మార్పు లేదని గుర్తించారు.
ప్రజలు టీకా తీసుకోవడానికి వెనుకాడడానికి గల కారణాల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీకాల క్లినికల్ ట్రయల్స్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం నిర్వహించారు.