Bihar: 5 నిమిషాల వ్యవధిలో మహిళకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు!
- బీహార్‌లోని పాట్నాలో ఘటన
- రెండో డోసు తీసుకున్న వెంటనే జ్వరం
- వైద్య బృందం పర్యవేక్షణలో వృద్ధురాలు
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అధికారులు
టీకా కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య కార్యకర్తలు ఓ మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు టీకాలూ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బీహార్‌లో జరిగిందీ ఘటన. పాట్నా శివారులోని పున్‌పున్ పట్టణంలోని ఓ పాఠశాలలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో 65 ఏళ్ల సునీలాదేవి అనే మహిళ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లారు. అక్కడ 18 ఏళ్లు పైబడిన వారికి ఓ వరుసలో, 45 ఏళ్లు పైబడిన వారికి మరో వరుసలో టీకాలు వేస్తున్నారు. మొదటి వరుసలోకి వెళ్లి కొవిషీల్డ్ టీకా వేయించుకున్న ఆమె సిబ్బంది సూచనతో కాసేపు అక్కడే కూర్చుంది. ఐదు నిమిషాల తర్వాత మరో వరుసలోకి వెళ్లి కొవాగ్జిన్ టీకా వేయించుకున్నట్టు వైద్యాధికారి సంజయ్ కుమార్ తెలిపారు.
రెండు టీకాలు వేయించుకున్న వెంటనే ఆమెకు కొద్దిపాటి జ్వరం వచ్చిందని, ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని సంజయ్ కుమార్ తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ గురించి వృద్ధురాలికి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు.