WTC Final: హమ్మయ్య... టాస్ పడింది.. డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలైంది!
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంగా ఉందన్న కోహ్లీ
- ప్రస్తుతానికి తప్పిన వర్షం అడ్డంకి
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో ఎట్టకేలకు టాస్ పడింది. నిన్ననే ఆరంభం కావాల్సిన మ్యాచ్ కాస్తా.. టాస్ పడకుండానే వర్షార్పణం అయింది. రెండో రోజు దాకా ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతానికి వర్షం లేకపోవడంతో ఆటకు ఆటంకాలు తప్పినట్టయింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ను ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టాస్ గెలిస్తే తానూ బౌలింగ్ వైపే మొగ్గు చూపేవాడినని కోహ్లీ అన్నాడు. అయితే, స్కోరుబోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తామన్నాడు. తమ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ సమతూకంగా ఉందన్నాడు. కాగా, ఇంగ్లండ్ లోని రోస్ బౌల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది.
తుది జట్లివి..
భారత్ : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: టామ్ లాథమ్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికొల్స్, బీజే వాట్లింగ్ (కీపర్), కొలిన్ డీ గ్రాండ్ హోం, కైలీ జేమీసన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.