Sharmila: విచారణ నెపంతో అన్యాయంగా ఒక మహిళ ప్రాణాలు తీస్తారా?: వైఎస్ షర్మిల ఆగ్రహం
- దొంగతనం అన్న అనుమానంతో మహిళను అరెస్టు చేశారు
- మహిళను లాకప్ డెత్ చేశారు
- పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి
- అడ్డగూడూరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో నిన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన అంబడిపూడి మరియమ్మ(44) అనే మహిళ మృతి చెందడంతో దీనిపై కొందరు నాయకులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల పోలీసులపై మండిపడ్డారు.
'దొంగతనం అన్న అనుమానంతో అరెస్టు చేసిన మహిళను లాకప్ డెత్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. నిజనిజాలు నిగ్గుతేల్చకుండా చంపమని చెప్పిందా ఈ సర్కార్..? పోలీస్ స్టేషన్‌లో చంపేసి గుండెపోటు అంటూ నాటకాన్ని రక్తికట్టిస్తారా..? ఇదేనా మీరు చేసే విచారణ?' అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
'విచారణ నెపంతో అన్యాయంగా ఒక మహిళ ప్రాణాలు తీస్తారా..? మరియమ్మను పొట్టనపెట్టుకున్న అడ్డగూడూరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.