Mekathoti Sucharitha: టీడీపీ హయాంలో 30కి పైగా హత్యలు జరిగాయి: హోంమంత్రి సుచరిత
- పాత కక్షల వల్లే కర్నూలు జిల్లాలో హత్యలు జరిగాయి
- లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారు
- టీడీపీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని అన్నారు. టీడీపీ హయాంలో ఏ రాజ్యాంగం నడిచిందో చంద్రబాబు, నారా లోకేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కక్షల వల్లే జరిగాయని ఆ ప్రాంత ప్రజలే చెపుతున్నారని అన్నారు. నారా లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేశ్ లపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగన్ పాలనను చూసి టీడీపీ భయపడుతోందని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. అండర్ వరల్డ్ డాన్స్ తో లోకేశ్ కు సంబంధాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో సీబీఐని నిషేధించింది చంద్రబాబేనని అన్నారు.