Andhra Pradesh: జస్టిస్ కనగరాజ్‌కు కొత్త పదవి.. త్వరలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పోరాటంతో ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకున్న జస్టిస్ కనగరాజ్
- ఆయన సారథ్యంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం
- జనవరిలోనే ఏర్పాటు చేసిన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. రమేశ్ కుమార్ పోరాటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకున్న జస్టిస్ కనగరాజ్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పోస్టును సృష్టించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత కనగరాజ్‌ను మళ్లీ ఆ పదవిలో నియమిస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు.
దీంతో ఆయనను ఎలాగైనా ఓ పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ను ఏర్పాటు చేసి దానికి ఆయనను చీఫ్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల ఫిర్యాదులకు పోలీసులు స్పందించనప్పుడు, సకాలంలో తగిన న్యాయం లభించనప్పుడు ప్రజలు ఈ పీసీఏను ఆశ్రయించవచ్చు. పీసీఏను ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరిలో దీనిని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పీసీఏను ఏర్పాటు చేసి దానికి జస్టిస్ కనగరాజ్ ను సారథిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.